మోమో..వామ్మో! | Sakshi
Sakshi News home page

Published Fri, Aug 3 2018 3:24 AM

Momo Suicide Challenge Spread On WhatsApp  - Sakshi

బ్లూవేల్‌ చాలెంజ్‌.. గతేడాది పలు దేశాలను వణికించిన ఈ ఆన్‌లైన్‌ గేమ్‌.. వందలాది మంది యువత ప్రాణాలను బలిగొంది. మన దేశంలోనూ పలువురు ఈ గేమ్‌ వల్లే తమ ప్రాణాలను తీసుకున్నారని చెబుతారు.. ప్రస్తుతానికి బ్లూవేల్‌ భయం లేదు.. అంతా బాగానే ఉంది అని అంటున్నారు.. నిజంగానే అంతా బాగానే ఉందా.. మరి ఈ ‘మోమో’ ఏంటి? అర్జెంటీనాలోని ఓ బాలిక ఆత్మహత్యకు దీనికి లింకేంటి? పలు దేశాల్లో మొదలైనఆ కలవరానికి కారణమేంటి?

ఏమిటీ మోమో.. ఏమిటా వికృత అవతారం.. 
మోమో.. ఫేస్‌బుక్‌లోని ఓ గ్రూప్‌లో మొదలై.. ప్రస్తుతం వాట్సాప్‌లో చాప కింద నీరుగా విస్తరిస్తున్న ఓ ఆన్‌లైన్‌ గేమ్‌. దీని అవతార్‌గా ఓ వికృత ముఖాన్ని వాడారు. వాస్తవానికి ఇదో   బొమ్మతాలూకు ముఖం. దీన్ని జపాన్‌కు చెందిన మిదోరీ హయాషీ అనే ఆమె తయారుచేశారు. అయితే.. ఆమెకు ఈ గేమ్‌కు ఎలాంటి సంబంధం లేదట. రష్యాలో మొదలైన బ్లూవేల్‌ చాలెంజ్‌లాగానే ఇది కూడా డెత్‌ గేమ్‌ అని అర్జెంటీనా, మెక్సికో, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా తదితర దేశాల పోలీసులు అనుమానిస్తున్నారు. 

కారణమేంటి?
గత ఆదివారం అర్జెంటీనాలో 12 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. తమ ఇంటి పెరడులోని చెట్టుకు ఉరివేసుకుంది. పోలీసులు సమీపంలో పడి ఉన్న ఆమె ఫోన్‌ను హ్యాక్‌ చేయగా..  ఈ మోమో చాలెంజ్‌ గురించి బయటపడింది. ఈ గేమ్‌ మొదలై.. కొన్ని వారాలైందని.. సదరు బాలిక కూడా ఈ గేమ్‌లోని చాలెంజ్‌లను పూర్తి చేస్తూ వచ్చిందని భావిస్తున్నారు. పైగా ఆ బాలిక తన చివరి క్షణాలను వీడియో తీసింది. గేమ్‌లో చేసిన చాలెంజ్‌లో భాగంగానే ఈ వీడియోను తీసి పోస్ట్‌ చేయాలని ఆమె భావించి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. వీడియోలో ఆమె హావభావాలను పరిశీలిస్తే.. ఇందుకు ఆమెను ఎవరో ప్రేరేపించినట్లు స్పష్టమవుతుందని అంటున్నారు. వాట్సాప్‌లో మోమో చాలెంజ్‌లో భాగంగా ‘ఓ 18 ఏళ్ల అజ్ఞాత యువకుడి’తో సంభాషణలు జరిపిందని.. చనిపోయే ముందు కూడా మెసేజ్‌లు పంపిందని పోలీసులు చెప్పారు. గతంలో ఆమె తీసిన వీడియోలను ఆమె స్నేహితులు కూడా చూశారట. దీంతో వారు ‘మోమో చాలెంజ్‌’ బారిన పడకుండా ఉండేందుకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. ఆ అజ్ఞాత యువకుడి కోసం గాలింపు మొదలైంది.

ఎవరు చేస్తున్నారు? 
అసలు ఈ మోమో అన్నది ఎక్కడ నుంచి ఆపరేట్‌ చేస్తున్నారు.. దీని వెనక ఎవరున్నారన్న వివరాలు ఇప్పటికీ తెలియలేదు. దీని వెనకున్నవారు ఎక్కువగా టీనేజ్‌ యువతీయువకులను లక్ష్యంగా చేసుకుంటున్నారని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. గేమ్‌లో ముందుగా.. మోమోను కాంటాక్ట్‌ అవ్వడానికి వీలుగా మనకు తెలియని ఓ నంబర్‌ ఇచ్చి.. మెసేజ్‌ పంపుతూ చాట్‌ చేయాలంటూ చాలెంజ్‌ విసురుతారు. మనం పంపితే.. భయానక చిత్రాలు.. హింసాత్మక సందేశాలు వస్తాయి. పలు పనులు పూర్తి చేయాలంటూ వరుసగా సవాళ్లు వస్తాయి. స్వీయ హాని చేసుకునేలా ఇవి ప్రోత్సహిస్తుంటాయి. చాలెంజ్‌ పూర్తి చేయని వాళ్లకు బెదిరింపు సందేశాలు కూడా వస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఇప్పటివరకూ ఇలాంటి మెసేజ్‌లు ఓ ఏడు నంబర్ల నుంచి వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అవి జపాన్, లాటిన్‌ అమెరికా దేశాలకు చెందినవని తేలింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ కొత్త గేమ్‌ మరో బ్లూవేల్‌ తరహా దారుణాలకు దారి తీస్తుందని భయపడుతున్నారు.

పిల్లలు.. పేరెంట్స్‌ చేయండిలా.. 
ఇప్పటికే ఆయా దేశాల్లో పిల్లలు, వారి తల్లిదండ్రుల సందేహాలను తీర్చడానికి హెల్ప్‌లైన్లు పెట్టారు. కొత్త నంబర్లకు సందేశాలు పంపొద్దని.. ఏదైనా నచ్చకపోతే.. ధైర్యంగా నో అని చెప్పాలని హితబోధ చేస్తున్నారు. మిగతావాళ్లు చేస్తున్నారని.. ఆ బాటలో వెళ్లడం సరికాదంటున్నారు. తేడా అనిపిస్తే.. తల్లిదండ్రులకు చెప్పాలని.. దాయడం సరికాదంటున్నారు. అటు తల్లిదండ్రులు కూడా పిల్లలను ఓ కంట కనిపెడుతూ ఉండాలని.. వారు సోషల్‌ మీడియాలో ఏమి అప్‌లోడ్‌ చేస్తున్నారు.. ఎవరితో సంభాషణలు జరుపుతున్నారన్న విషయాలను పరిశీలించాలని సూచిస్తున్నారు. బిజీలో పడి.. పిల్లలు చెబుతున్నదాన్ని అశ్రద్ధ చేయవద్దని అంటున్నారు. విదేశాల్లో పరిస్థితి ఇలా ఉంది.. ఒకవేళ మన దగ్గరే మోమో అంటూ ఎవరైనా మెసేజ్‌ పంపితే.. నో అని గట్టిగా చెప్పాలి..     తొలి దశలోనే తుంచేయాలి..  

Advertisement
Advertisement